శబరిమలలో భారీ బందోబస్తు

Submitted by Likhitha on Mon, 11/05/2018 - 09:47
శబరిమలలో భారీ బందోబస్తు

                     ఆలయంలోకి వెళ్లొచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఓవైపు... వెళ్లేందుకు అభ్యంతరం లేదన్న కేరళ ప్రభుత్వ మద్దతు మరోవైపు... ఎలా వెళ్తారో చూస్తామన్న భక్తుల హుంకరింపులు ఇంకోవైపు...  ఉద్రిక్తతల నడుమ మరోసారి శబరిమల ఆలయ తలుపులు ఇవాళ మరోసారి తెరచుకోనున్నాయి. నెలవారీ పూజల కోసం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ భక్తులను అనుమతిస్తారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఈసారీ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

                     శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు గత నెలలో అమలు కాని నేపథ్యంలో మరోసారి ఆలయ ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. నెలవారీ పూజల కోసం భారీభద్రత మధ్య ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఐదు గంటల పాటు జరిగే పూజల నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకూ అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ, రేపు శబరిమల ఆలయ ద్వారాలు తెరచి ఉంచనున్నారు. అయ్యప్ప ఆలయంలో శ్రీచిత్తిర తిరునాళ్ నిర్వహణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

                      శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శబరిమల మహా ఆలయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో 144 సెక్షన్ తో పాటు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. శబరిమల, పంబ, నీలక్కళ్, ఇలౌంగళ్ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. దాదాపు 3 వేల మంది పోలీసులను, కేంద్ర బలగాలను భద్రత కోసం వినియోగిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఐజీలు, 10 మంది ఎస్పీలతో పాటు వేలాది మంది సాయుధ పోలీసులు ఉన్నారు. గతనెలలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. 

                      అక్టోబర్ లో ఆలయ ద్వారాలు తెరచుకోగానే తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. వివిధ వయోవర్గాల మహిళలతో పాటు మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కేరళ ప్రభుత్వం కల్పించిన భద్రతతో ఆలయ ముఖద్వారం వరకూ వెళ్లగలిగినా.. పూజారులు చివరినిమిషంలో వారిని అడ్డుకున్నారు. మహిళలను అనుమతిస్తే ఆలయ ద్వారాలు మూసేసి వెళ్లిపోతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు కూడా చేసేది లేక వారిని వెనక్కి పంపారు. ఈసారి కూడా దాదాపు అలాంటి పరిస్ధితులే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

                  శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్న నేపథ్యంలో మహిళల ప్రవేశంపై మళ్లీ చర్చ మొదలైంది. సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని పండిట్ రవిశంకర్ సహా పలువురు సూచిస్తున్నారు. మహిళలతో పూజలు అందుకోని దేవుడు తన దృష్టిలో దేవుడే కాదంటూ సినీనటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. 

                 శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ, పందలం రాజకుటుంబంతో చర్చలు జరిపేందుకు కేరళలోని పినరయి విజయన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.

sabarimala
Sabarimala Temple
Reopens
Police Protection
2
300 Cops on Guard
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Sabarimala Temple Reopens Today
Video URL

YOU MAY LIKE