ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్న ఉద్యమకారులను గుర్తించాలి..

chandrababu

రాజధానిగా అమరావతే కొనసాగాలని రైతుల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 100 వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వంద రోజులుగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ అమరావతి రైతుల ఆందోళన కొనసాగిందని చంద్రబాబు అన్నారు.

"అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఈరోజు వందో రోజు. అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ ఇన్ని రోజులు కొనసాగిన ఉద్యమం... ఇప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ  కొనసాగుతూనే ఉంది.  రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్లిష్టసమయంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ వాళ్ళు దేశం కోసం అండగా నిలిచినట్టుగానే... రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్న అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. రాజధాని అమరావతి ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి." అని చంద్రబాబు డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసారు.