కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది

రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో స్పందిస్తూ..... "కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి." అని తెలిపారు.

కరోనా సోకిందన్న ఆవేదనతో 60 ఏళ్ల మహిళ ఆత్మహత్య

కరోనా సోకిందన్న ఆవేదనతో 60 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడింది. కునిగల్‌కు చెందిన మహిళకు జూన్ 18 న కరోనా పరోక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తెలవడంతో, బెంగుళూరులోని కెసి జనరల్ ఆసుపత్రిలో చేరింది. జూన్ 26, శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆ మహిళ ఆసుపత్రి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ ప్రాంభించారు. ఆమె కుమారుడు, కోడలు మరియు ఆమె మనవడుకి కరోనా పరీక్షలు చేయగా వారికీ కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఆమె మనస్థాపానికి గురై ఆవేదనతో ఆస్పత్రిలోని బాత్రూములో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 17,296 కొత్త కేసులు... 407 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభన కొనసాగుతూనే వుంది. రోజురోజుకి కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 407 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401 కి చేరుకున్నాయి. అయితే వీరిలో 1,89,463 మంది కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 2,85,637 మంది కరోనా నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 
అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 77.76 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 2.15 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించింది.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ... మరో జవాన్ వీరమరణం 

ఈ నెల 15 న భారత్-చైనా సరిహద్దులో లడక్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో భారత జవాన్ మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గల్వాన్ లోయలో భారత-చైనా సరిహద్దు వెంబడి నదిలో పడిపోయిన తన సహచరులను రక్షించే ప్రయత్నంలో మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన భారత ఆర్మీ జవాన్ తీవ్ర గాయాలపాలు అయ్యాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సచిన్ మోరే ఈ రోజు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో గాల్వన్ లోయలో ఘర్షణలో మరణించిన సైనికుల సంఖ్య 21 కి చేరుకున్నాయి. 
 

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్ 

రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వైసిపి ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్యే అంబలి రాంబాబు, శాసనమండలి పక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వెంటరాగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ శాసనమండలి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. గతంలో టిడిపి తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అప్పుడే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

వందే భారత్ మిషన్...వాషింగ్టన్ నుండి ఢిల్లీకి 224 మంది భారతీయులు 

వందే భారత్ మిషన్ లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు వాషిగ్టన్ డిసి నుండి ఇండియాకు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం బయలుదేరారు. వాషింగ్టన్ డిసి నుండి ఢిల్లీకి బయలుదేరిన విమానం విమానంలో పసిపిల్లలతో సహా మొత్తం 224 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి మే 7 నుండి ప్రారంభమైన వందే భారత్ మిషన్ లో ఇది మూడవ దశ. ఇటీవలి జూన్ 11 న వందే భారత్ మిషన్ మూడవ దశ ప్రారంభమైంది.

టీడీపీ నేతలు అరెస్ట్ 

ప్రజా వేదికను కూల్చి ఏడాది అయిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు కరకట్ట ప్రాంతానికి వెళ్లిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కరకట్ట ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావన్ ‌కుమార్‌, నక్కా ఆనందబాబు మరియు టీడీపీ కార్యకర్తలు ప్రజా వేదిక వద్దకు బయలుదేరారు. అయితే వీరి రాకను గమనించిన పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు. మొత్తం నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే ఆపేసి, ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేసారు.

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు 

దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న నేపథ్యంలో 10 వ తరగతి, 12 వ తరగతి పరిక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుండి జూలై 15 వరకు జరగాల్సిన పరీక్షలను నిర్వహించడానికి తగిన పరిస్థితులు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు సుప్రీమ్ కోర్టుకు తెలిపింది. అయితే కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఏపీలో కొత్తగా 553 కరోనా కేసులు 

కరోనా మహమ్మారి ఏపీని అతలాకుతలం చేస్తుంది. కరోనా విజ్రంభన విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 477 మంది కాగా, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులెటిన్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరాయి.

ఆల్ రౌండర్ మహమ్మద్ హఫీజ్ పై పీసీబీ ఆగ్రహం

కరోనా నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో 29 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ పదిమందిలో ఒకడైన ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అయితే ఈ పరీక్షలో నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ హఫీజ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కాగా ఈ విషయంలో పీసీబీ హఫీజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ సీఈఓ వసీం ఖాన్ మాట్లాడుతూ... ప్రైవేట్ పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకునే ముందు బోర్డును అతను సంప్రదించలేదని హఫీజ్ పై మండిపడ్డారు.