లాక్ డౌన్.. పోలీసులకు కుర్రకారు కథలు

lockdown

ఏదైతే జరగకూడదనే దేశంలో లాక్ డౌన్ విధించారో కొంతమంది అందుకుభిన్నంగా వ్యవహరిస్తున్నారు.. ప్రజలు గుంపులు గుంపులుగా ఒకే చోట చేరితే మహమ్మరి ప్రబలే అవకాశముందని లాక్ డౌన్ విధిస్తే..కొందరు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఇతరులకు చేటు చేసేలా వ్యవహరిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని నెత్తి నోరు మొత్తుకుంటున్నా కొందరు అలసత్వం వహిస్తూ మొత్తం సమాజాన్నే ప్రమాదంలో పడేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి ఆగలేకపోతున్న కుర్రకారు బైకు లేసుకుని ఎంచక్కా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాంగ్‌డ్రైవ్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

పోలీసులు వీరిని ఆపినప్పుడు చెబుతున్న కారణాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద రాచకొండ పోలీసులకు దొరికిన ఓ యువకుడు చెప్పిన కథకి పోలీసులు కంగుతిన్నారు. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తమ ఫోన్‌లో ఓ వ్యక్తి ఫొటో చూపించి.. అతడు కనిపించడం లేదని, వెతుకుతూ ఇలా వచ్చామని చెప్పారు. వారు చెప్పింది నమ్మిన పోలీసులు ఆ ఫొటో తీసుకుని అతడు కనిపిస్తే చెప్పాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించేందుకు రెడీ అయ్యారు. అయితే, యువకుల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు.

దీంతో అసలు విషయం బయటపెట్టారు. రోడ్లు ఖాళీగా ఉండడంతో లాంగ్‌డ్రైవ్‌కు వచ్చామని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. నగరంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రక్తదానం కోసం అంటూ ఒకరు, తమవారు ఆసుపత్రిలో ఉంటే చూడడానికి వెళ్తున్నామని మరొకరు ఇలా రకరకాల కారణాలు చెప్పి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆకతాయిలు రకరకాల కారణాలతో తప్పించుకొనేందుకు యత్నిస్తుండటంతో అత్యవసరంగా వెళ్లేవారిని కూడా ఒకటికి.. రెండుసార్లు ప్రశ్నించాల్సి వస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.