లాక్‌డౌన్ మాత్రమే సరిపోదు : డబ్ల్యూహెచ్‌వో

who

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 21 వేలకు పైగా మృతిచెందారు. కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. దాదాపు 300 కోట్ల జ‌నాభా ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న‌ది.  ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సందర్బంగా డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అద‌న‌మ్ గెబ్రియాసిస్ మాట్లాడుతూ.. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు కేవ‌లం లాక్‌డౌన్ చ‌ర్య‌లు స‌రిపోవ‌న్నారు. ఆ మ‌హ‌మ్మారిని రూపుమాపాలంటే మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే వైర‌స్‌పై అటాక్ చేయాల‌ని కూడా అన్ని దేశాల‌కు పిలుపు ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను విస్త‌రించాల‌ని, ప‌బ్లిక్ హెల్త్ వ‌ర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాల‌ని ఆయ‌న ప్ర‌పంచ‌ దేశాల‌కు సూచించారు. క‌మ్యూనిటీ స్థాయిలోనే అనుమానిత కేసుల‌ను గుర్తించే వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకోవాల‌ని.. అనుమానితుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు కావాల్సిన వైద్య ప‌రిక‌రాల‌ ఉత్ప‌త్తిని, సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవాల‌న్నారు.