వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు : తలసాని

talasani

వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నేడు నగరంలోని గాంధీ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి డాక్టర్లు మనకు వైద్యం అందిస్తున్నారని, అలాంటివారిపై దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దన్నారు. 

గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల యాచకులను తరలించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరిని దాదాపు గుర్తించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.