భారత్-చైనా సరిహద్దులో కూలిన వంతెన

Bridge Collapsed

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న బెయిలీ వంతెన కూలిపోయింది. భారీ క్రేన్ ను మోసుకెళ్తున్న ఓ భారీ వాహనం ఈ వంతెనపై వెళుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తో సహా క్రేన్ ఆపరేటర్ గాయపడ్డారు. వీరిని సమీపంలోని మున్సియారి ఆస్పత్రికి తరలించారు. 40 అడుగుల పొడవైన ఈ వంతెనను 2009లో నిర్మించారు. అధిక బరువుతో కూడిన ట్రక్కు కారణంగానే కూలిపోయినట్లు అధికారులు నిర్థారించారు. వంతెన సామర్థ్యం 18 టన్నులు కాగా, క్రేన్‌, లారీ కలిపి 26 టన్నులు ఉన్నట్లు తెలిపారు. జోహార్‌ వ్యాలీలోని సుమారు 15 గ్రామాల ప్రజలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారని, ఈ ఘటనతో తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరో బ్రిడ్జీని నిర్మించేందుకు 15 రోజుల సమయం పడుతుందని అన్నారు.