అందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు..: దేవినేని ఉమా

Submitted by editor on Fri, 02/14/2020 - 11:14
Devineni Uma

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్‌.. అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని అయన ఆరోపించారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల రేషన్‌కార్డులు, 7లక్షల పింఛన్లు తొలగించి ఇప్పుడు రీవెరిఫికేషన్‌ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి అప్పు ఇచ్చేవాడు లేడని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ధ్వజమెత్తారు. తన కేబినెట్‌లోని 8మంది మంత్రులతో పాటు వైకాపా ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.