కేసీఆర్ కాన్వాయ్‌ కు జరిమానా

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ కు తెలంగాణ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించింది.  అతివేగం కారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. .అయితే తాజాగా జూన్ 1న పడిన జరిమానాతో మొత్తం దాదాపుగా రూ.4,140  ఫైన్ చేరింది. ట్రాఫిక్ రూల్స్‌కు సీఎం కాన్వాయ్ కూడా అతీతం కాదని.. ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు ప్రూవ్ చేశారు. 

తీరాన్ని తాకిన 'నిస‌ర్గ'

నిస‌ర్గ తుఫాన్‌.. తీరాన్ని తాకింది.  మహారాష్ట్ర, గుజరాత్ తీరాన్ని తాకింది. ఇక, పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది.. మ‌రో మూడు గంట‌ల్లో నిస‌ర్గ సంపూర్ణంగా తీరం దాట‌నున్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ప్రకటించింది.. వచ్చే మూడు గంటల్లో తుఫాను క్రమంగా ముంబై మరియు థానే జిల్లాల్లోకి ప్రవేశిస్తుందని ఐఎండీ చెబుతోంది... మహారాష్ట్ర తీర ప్రాంతం .. రాయ్‌గడ్ జిల్లా గుండా వెళ్లనుంది అని అంచనా వేస్తున్నారు.. ఇక, తుపాను యొక్క వేగం ప్రస్తుతం గంటకు 100-110 కిలోమీటర్లు వేగంలో ఉందని చెబుతున్నారు.

సీఎం కెసిఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కెసిఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.  సికందరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో వున్న అంబర్ పేట ప్రధాన కూడలి వద్ద వంతెన పనులను వెంటనే ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు. 202 జాతీయ రహదారిపై అంబర్‌పేట క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మించే వంతెనకు రెండు సంవత్సరాల క్రితం(05-05-2018న) కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

ఏపీలో మరో 79 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 3వేల 279కి చేరింది. 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2244 మంది కోలుకోగా.. 967 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 68 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

11న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 11న జరుగునుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశానికి సంబంధించిన ప్రతిపాదిత అంశాలను 9 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయలు తీసుకునే  అవకాశం ఉంది.

పార్టీ రంగులు తొలగించండి: సుప్రీం కోర్టు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలంటూ ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని ఆదేశించింది. రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్కరణ కింద తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. హై కోర్టు చెప్పినా రంగులు ఎందుకు తొలగించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మళ్లీ వేరే రంగు జత చేసి జీవో ఎందుకు ఇచ్చారు? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఎన్టీఆర్ అభిమానులపై సైబర్ క్రైమ్ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయింది హీరోయిన్ మీరా చోప్రా. ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆతరవాత తమిళ్ , హిందీ లో సినిమాలు చేసింది. తాజాగా మీరా చోప్రా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.  అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ఎన్టీఆర్ గురించి అడగగా.. తను ఆయన ఫ్యాన్ కాదని చెప్పారు.

నిమ్స్ లో కరోనా కలకలం

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో రోగులు హడలిపోతున్నారు. నలుగురు డాక్టర్లు, ముగ్గురు క్యాథల్యాబ్ సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. 15మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన నింపింది. ఇప్పుడు నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లను కూడా కరోనా వదలడం లేదు. దీంతో నిమ్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది.

గాంధీలో కరోనా రోగులపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..!

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. కరోనా రోగులకు చికిత్స జరుగుతున్న వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడవ అంతస్తులోని పలు వార్డుల్లో కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తాము మరింత భయాందోళనలకు గురయ్యామని రోగులు వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు.  అయితే ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. 

బాణాలతో దాడి.. చాతిలోకి దూసుకెళ్లిన బాణం

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో దారుణం జరిగింది. అడ్డతీగల మండలంలోని వేటమామిడి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య రేగిన వివాదం బాణాలు వేసుకునే వరకూ వెళ్లింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వేటమామిడికి చెందిన చెట్ల ప్రకాష్.. కంబాల సతీష్ కు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో సతీష్ .. ప్రకాష్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రకాష్ బంధువు.. సతీష్ ను నిలదీయగా.. ఆగ్రహించిన సతీష్ బాణాలతో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ప్రకాష్ మేనబాబు చిట్టిబాబు చాతిలోకి బాణం దూసుకెళ్లింది. గాయపడ్డ చిట్టిబాబును అడ్డతీగల ఆస్పత్రికి తరలించారు.