అప్పటి వరకు జగన్‌ రెడ్డి అనే పిలుస్తా

సీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా.. ఇక్కడ వెనుకబాటు ఉందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపనికీ వైసీపీ వ్యతిరేకంగా వెళ్తుందని అన్నారు. రాయలసీమలో రైతులకు శీతల గిడ్డంగులు కట్టలేకపోయారని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్‌ పరిశ్రమలు పెట్టుకునేందుకు కాదన్నారు. ఇక్కడ నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని.. పేదలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్తున్నారని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం.. జనసేన గుండెబలానికి భయపడుతోందని అన్నారు. ఓట్ల రాజకీయాలు చేయనిరోజు, రైతుల్ని ఇబ్బందిపెట్టని రోజే జగన్‌ను గౌరవిస్తానని, అప్పటి వరకు జగన్‌ రెడ్డి అనే పిలుస్తానని పవన్‌ పేర్కొన్నారు.