అర్థరాత్రి నుంచి పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు

తెలంగాణలో నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలోనే బస్సు ఛార్జీలను కూడా పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్… కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతామని అన్నారు. పెరిగిన చార్జీల ప్రకారం పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 5 నుంచి రూ. 10కి, సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15కి పెంపు, డీలక్స్‌ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20కి పెంపు, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 25గా నిర్ణయించారు. ఈ పెరిగిన ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

అదేవిదంగా టీఎస్ ఆర్టీసీ బస్ పాసుల ఛార్జీలు పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ ఛార్జి రూ.770 నుంచి రూ.950కి పెంచారు. అలాగే మెట్రో పాస్ ఛార్జి రూ.880 నుంచి రూ.1070కి, మెట్రో డీలక్స్ పాస్ ఛార్జి రూ.990ల నుంచి రూ.1180లకు పెంచారు. అలాగే స్టూడెంట్ బస్ పాస్ కు రూ.390ల నుంచి రూ.495లకు టీఎస్ ఆర్టీసీ పెంచింది.