ఇండియాపై దాడికి ఐసిస్ ప్రయత్నాలు

ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రసంస్థ గత ఏడాది పలుమార్లు ఇండియాపై ఉగ్రదాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం వెల్లడించింది. ఐసిస్‌కు చెందిన ఖొరసన్‌ గ్రూప్‌(ఐసిస్‌-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌ రస్సెల్‌ ట్రావర్స్‌ వెల్లడించారు.

గత నెల పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో ట్రావర్స్‌ పర్యటించారని, పలువురు భద్రతాధికారులు, నిఘా వర్గాలతో భేటీ అయ్యారని గుర్తు చేస్తూ.. తన పర్యటన తరువాత ఐఎస్ఐఎస్-కే ప్రాబల్యం పెరిగిన విషయం అర్థమైందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఐఎస్ఐఎస్ కు అనుబంధంగా 20 గ్రూపులు పని చేస్తున్నాయని, వీటి వద్ద డ్రోన్ సాంకేతికత కూడా ఉందని ట్రావర్ గుర్తు చేశారు. కేవలం సిరియా, ఇరాక్ దేశాల్లో ఉగ్రవాద సంస్థను తుడిచి పెట్టినంత మాత్రాన ముప్పు తప్పినట్టు కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉగ్ర మూలాలు ఏనాటికైనా మానవాళికి పెనుముప్పేనని హెచ్చరించారు.