టీటీడీ నుండి డాలర్ శేషాద్రి ఔట్..! మరో వంద మందికీ ఉద్వాసన: తితిదే కీలక నిర్ణయం..!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేస్తున్న దాదాపు వంద మందిపై వేటు పడనుంది. అందులో శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రి కూడా ఉన్నట్లు విశ్వస నీయ సమాచారం. అయితే, తన పైన వేటు పడకుండా ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ పరిధిలలో పని చేస్తున్న రిటైర్డ్ అధికారులు..సిబ్బందిని తొలిగించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వీరి మీద వేటు పడనుంది. ఇప్పటికే టీటీడీ జాబితా సిద్దం చేసినా.. మరోసారి జాబితాను పరిశీలించే నిమిత్తం ఉత్తర్వులు జారీ చేయకుండా ఆపినట్లు తెలుస్తోంది. గురువారం ఈ జాబితాలో ఎటువంటి మార్పులకు అవకాశం లేకపోతో దాదాపు వంద మందిని తొలిగిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి.

డాలర్ శేషాద్రి పైన వేటు.. శ్రీవారి ఆలయ ఓఎస్డీగా కొనసాగుతన్న డాలర్ శేషాద్రికి ఉద్వాసన పలకాలని టీటీడీ నిర్ణయించినట్లు సమాచారం. సుదీర్ఘ కాలం టీటీడీలో పని చేసిన శేషాద్రి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు.. వ్యవహారాల పైన పూర్తి పట్టు ఉంది. ఎక్కడ శ్రీవారి ఆలయం ద్వారా కార్యక్రమాలు నిర్వహించినా ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే. అదే విధంగా శ్రీవారి ఆలయానికి వచ్చే ప్రముఖలకు ఆయన దగ్గర ఉండీ అన్నీ తానై వ్యవహరిస్తారనే అభిప్రాయం ఉంది. రిటైరైన ఉద్యోగులను తొలిగించాలని అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయం కావటంతో ఇప్పుడు టీటీడీలో సైతం 2019 మార్చి 31కి ముందు పని చేస్తున్న రిటైరైన ఉద్యోగులను తొలిగించాలని నిర్ణయంతో డాలర్ శేషాద్రి పైన వేటు తప్పదని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వంలో అదే విధంగా ప్రముఖుల వద్ద పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్న శేషాద్రి విషయంలో ఉద్వాసన పలుకుతారా లేదా అనేది చివరి నిమిషం వరకూ సందేహమే. ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే..ఆయన పైన వేటు వేయటానికే టీటీడీ సిద్దంగా ఉంది. దీంతో..డాలర్ శేషాద్రి విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

వంద మందికి ఉద్వాసన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో భాగంగా టీటీడీలో కీలక విభాగాల్లో ఉన్న అధికారులకు ఉద్వాసన పలకాలని టీటీడీ నిర్ణయించింది. అందులో నిత్య అన్నదాన ప్రసాదం ట్రస్టు ప్రత్యేకాధికారి వేణు గోపాల్, దేవస్థానం ఉప న్యాయాధికారి వెంకట సుబ్బనాయుడు, ఎస్వీ రికార్డింగ్ ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమన్వయకర్త చెంచురామయ్య తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సంబంధాల ఓఎస్డీ వేమా వెంకటరత్నం తన పైన వేటు వేయవద్దని బోర్డు సభ్యులను కలిసి అభ్యర్దించినా..వారు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అయితే, ప్రభుత్వం మారిన తరువాత జరిగిన నియామకాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అదే విధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న సమాచార కేంద్రాలు..కళ్యాణ మండపాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. దీని ద్వారా ఇప్పుడు టీటీడీలో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడనున్నాయి. మరి..కొత్తగా భర్తీ నిర్ణయం జరిగే వరకూ సేవలపైన ప్రభావం పడకుంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైన టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.