తొలిరౌండ్‌లోనే నిష్క్రమించిన సైనా

చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఫుజౌలో బుధవారం జరుగుతున్న చైనా ఓపెన్‌లో సైనా నెహ్వాల్ చైనాకు చెందిన యాన్ యాన్ కై చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9 వ ర్యాంకర్ నెహ్వాల్ కేవలం 24 నిమిషాల్లో తొలి గేమ్‌లోనే 9-21తో.. రెండో గేమ్‌లో 12-21తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు భారత స్టార్‌ ఆటగాడు, సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారుడు సిత్తికోమ్‌ థమ్మాసిన్‌పై 21-14, 21-3తో వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో ఏడో సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌(డెన్మార్క్‌)తో తలపడనున్నాడు.