భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి

కర్తార్‌పూర్ కారిడార్‌ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి అని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. కర్తార్‌పుర్‌ కారిడార్‌ పూర్తయ్యిందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నవంబరు 1న రెండు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కర్తార్‌పుర్‌ వెళ్లేందుకు భారత యాత్రికులకు కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని ఇమ్రాన్‌ తెలిపారు. అంతేగాక.. కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభం రోజున, గురునానక్‌ జయంతి రోజున యాత్రికులకు సర్వీసు ఫీజు కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు ఉండాల్సిందేనని తాజాగా పాక్‌ ఆర్మీ స్పష్టం చేసినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరమా లేదా అనే విషయంపై పాక్‌ స్పష్టత ఇవ్వాలని భారత్‌ అడిగింది. దీనిపై ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ.. భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు ఉండాల్సిందేనని మీడియా సంస్థ ‘డాన్‌’ పేర్కొంది. ‘పాక్‌ భూభాగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు న్యాయపరంగా రావాల్సిందేనని.. భద్రతాపరమైన కారణాల రీత్యా పాస్‌పోర్టు ఆధారంగానే ఎవరినైనా దేశంలోకి అనుమతిస్తామని.. దేశ భద్రత, సమగ్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదు’ అని గఫూర్‌ స్పష్టం చేసారు.