రెండు ప్రేమ జంటల ఆత్మహత్య..

తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమ జంటలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాయి. వివరాల్లోకెళ్తే.. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన పల్లవి (19), ఆశమల్ల మహేందర్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు వీరి ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపం చెంది గ్రామానికి చెందిన సుశీల (20) అనే యువతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు సుశీల చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్(25).. ఊరి చివర రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కోన వెంకటేశ్వర్లు మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.