శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రం

కార్తీకమాసం మొదటి సోమవారం శ్రీగిరి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో రద్దీ కనిపించింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కృష్ణవేణికి వాయనాలు సమర్పించారు. కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద, నాగులకట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. సుమారు 70 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం స్వామి వారి ఆలయంలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతికి ఏర్పాట్లు చేశారు.