సిద్ధులగుట్టలో మహిళది ఆత్మహత్యే : డీసీపీ ప్రకాశ్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని సిద్ధులగుట్టలో మహిళ సజీవదహనంపై శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో సదరు మహిళ ఒంటరిగా కాలినడకన వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో ఆధారాలు లభించాయని చెప్పారు. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఓ ప్రాంతంలో ఆగి స్థానికులతో మాట్లాడిందని, తాను తన కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్నానని చెప్పిందని తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.