ప్రభుత్వ ఏర్పాటు పై పవార్ డ్రాప్…!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎన్సీపీ తప్పుకున్నట్టు ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, శివసేన పార్టీలకు అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారని, వీలైనంత తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీని గురించి ఇంతకు మించి మాట్లాడేందుకు ఏమీ లేదని పవార్ స్పష్టం చేసారు. దీనితో ఎన్సీపీ ప్రభుత్వంలో ఉంటుంది అనే ఊహాగానాలకు తెరదించినట్టు అయింది. శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయా అని ఆయన్ను మీడియా ప్రశ్నించగా 25 ఏళ్లుగా బీజేపీ,శివసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయని, నేడోరేపో మళ్లీ వారే కలిసిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం ఉదయం శరద్ పవార్‌తో భేటీ కాగా అనంతరం పవార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.