తిప్పరా మీసం.. మూవీ రివ్యూ…

టైటిల్‌: తిప్పరా మీసం
నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ తదితరులు
దర్శకుడు: ఎల్‌ కృష్ణవిజయ్
నిర్మాత: రిజ్వాన్‌
డీవోపీ: సిద్‌
సంగీతం: సురేష్ బొబ్బిలి

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు. ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. కథల ఎంపికలో శ్రీ విష్ణు అభిరుచి ప్రత్యేకం. అందుకే ఆయన సినిమా వస్తుందంటే విభిన్నమైన కథ ను చూడచ్చనే అభిప్రాయంతో వుంటారు అభిమానులు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది.మ‌రి శ్రీవిష్ణు ఈ చిత్రంతో నిజంగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మీసం తిప్పాడా? లేదా?

కథ…
మణిశంకర్ (శ్రీ విష్ణు) పబ్ లో డీజే గా చేస్తుంటాడు. చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? చివ‌ర‌కు మ‌ణి శంక‌ర్ జీవితంలో జ‌రిగే మార్పులేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమాని శ్రీ విష్ణు కథనం మరియు తన పాత్ర పై నమ్మకంతో చేసినట్లు అనిపిస్తుంది. పాత్ర ప‌రంగా చూస్తే ఎక్క‌డా ఓవ‌ర్ మాస్ ఎలిమెంట్స్‌, హీరోయిజం క‌న‌ప‌డదు. కంటెంట్ ప‌రంగానే సినిమా ర‌న్ అవుతుంది. అందుకు త‌గిన‌ట్లే శ్రీవిష్ణు క్యారెక్ట‌ర్ సినిమాలో ర‌న్ అవుతుంది. మ‌ణిశంక‌ర్ అనే పాత్ర‌లో శ్రీవిష్ణు చ‌క్క‌గా న‌టించాడు. త‌ల్లిని ద్వేషించే కొడుకు పాత్ర‌లో ఓ యాంగిల్‌… కుటుంబం కోసం నేర‌స్థుడిగా మారే కొడుకుగా మ‌రో యాంగిల్‌లో శ్రీవిష్ణు త‌న‌దైన న‌ట‌న‌తో ఆట్టుకున్నాడు. త‌ల్లిని ద్వేషించే కొడుకుగా ఓ కార‌ణాన్ని చూపించాడు. అదంత బ‌ల‌మైన కార‌ణంగా క‌నిపించ‌దు. స‌రే! అనుకున్నా.. హీరో క్యారెక్ట‌ర్‌ను త‌ర్వాత డిజైన్ చేసిన తీరు, దాని చుట్టూ రాసుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి స‌హనానికి ప‌రీక్ష పెడ‌తాయి. నిక్కి తంబోలి పాత్ర ప‌ర‌మితం. పాత్ర ప‌రిధి మేర త‌ను చ‌క్క‌గా న‌టించింది. ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన రోహిణి చాలా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ఇక సినిమాలో మిగిలిన పాత్ర ధార‌లంద‌రూ వారి వారి ప‌రిధులు మేర న‌టించారు.

గ‌మ‌నిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.